Mana Enadu : జమిలి ఎన్నికల (Jamili Elections) బిల్లులపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా లోకసభ బిజినెస్ జాబితా నుంచి ఈ 2 బిల్లులను తొలగించింది. తొలుత ఈ నెల 16న లోక్‌సభ (Loksabha) ముందుకు బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపరిచారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బిల్లు ప్రవేశపెడతారని కేంద్రం ప్రకటించింది. కానీ తాజాగా రివైజ్ చేసిన లోక్‌సభ బిజినెస్‌లో జమిలి ఎన్నికల బిల్లులు లేవు. తాజా పరిణామాలు నేపథ్యంలో.. శుక్రవారంతో ముగిసే శీతాకాల సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్దత నెలకొంది.
అధికరణాల సవరణ
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఎ అధికరణాన్ని చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం అధికరణం 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు అధికరణం 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే అధికరణం 327ని సవరించాల్సి ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టిన కేంద్ర మంత్రిమండలి.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు ఈ నెల 12న ఆమోదం తెలిపింది.
‘లాభమే తప్ప నష్టం లేదు’
జమిలి ఎన్నికలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) గతంలో స్పందించారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కొత్తగా వచ్చింది కాదని.. గతంలో కూడా భారత్‌లో ఈ విధానాన్ని అనుసరించామని చెప్పారు. 1952లో అన్ని ఎన్నికలూ ఒకేసారి జరిగాయని, దేశంలో మూడుసార్లు జమిలి ఎన్నికలు నిర్వహించామని అన్నారు. జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం లేదని హోంమంత్రి అన్నారు. దేశంలో తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల భారీగా ఖర్చు కావడం సహా సమయం కూడా వృథా అవుతోందన్నారు. కానీ ఈ బిల్లులపై కేంద్రం పునరాలోచనలో పడింది.






