
దేశవ్యాప్తంగా వివిధ ఆన్‌లైన్ వేదికల్లో పని చేస్తున్న కోటి మందికిపైగా గిగ్ వర్కర్లకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం ప్రత్యేక పింఛను పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పరిశీలనకు కార్మిక శాఖ పంపనుంది. ఆర్థిక అవసరాల కోసం స్విగ్గీ, ర్యాపిడో, ఓలా, జొమాటో, ఉబెర్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ సర్వీసుల్లో పనిచేసే వారిని ‘గిగ్ వర్కర్లు’ అంటారన్న విషయం తెలిసిందే. వీరి పని తాత్కాలికమే.. ఆదాయమూ తాత్కాలికమే. వీరికి నెలవారీ వేతనం ఉండదు.
గిగ్ వర్కర్లకు పింఛను ఖాతాలు
ఈ నేపథ్యంలోనే గిగ్ వర్కర్ల ద్వారా జరిగే ప్రతి సర్వీసు లావాదేవీ నుంచి ‘సామాజిక భద్రతా చెల్లింపు’ కోసం ఎప్పటికప్పుడు నిర్దిష్ట శాతంలో మొత్తాన్ని కేంద్ర కార్మిక శాఖ పింఛను ఖాతాలో జమ చేయాలని భావిస్తోంది. అయితే లావాదేవీపై ఎంత శాతాన్ని పింఛను కోసం సేకరించాలనే దానిపై మాత్రం ఓ నిర్ణయానికి రాలేదు. పింఛను ఖాతాలో జమయ్యే డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు గిగ్ వర్కర్లకు రెండు ఆప్షన్లు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.
డబ్బు విత్ డ్రాకు రెండు ఆప్షన్లు
- పదవీ విరమణ పొందేే సమయానికి పింఛను ఖాతాలో జమయ్యే డబ్బుపై వచ్చిన వడ్డీ ఆదాయాన్ని విత్ డ్రా చేసుకోవడం.
- పింఛను ఖాతాలో జమైన డబ్బును విడతలవారీగా బ్యాంకు ఖాతాలోకి పొందడం రెండో ఆప్షన్.
కేంద్ర బడ్జెట్‌లోనూ వరాలు
ఇటీవలే కేంద్ర బడ్జెట్‌లోనూ గిగ్ వర్కర్లకు సంబంధించి గుర్తింపు కార్డులను అందించడం సహా ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ ద్వారా వారికి ఆరోగ్య భద్రత కల్పిస్తామని నిర్మల తెలిపారు. ఇక రానున్న రోజుల్లో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి కూడా గిగ్ వర్కర్లు లబ్ధి పొందొచ్చు.