
YCP నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు(Lookout Notice) జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో, అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. భూమార్గం, వాయుమార్గం, జలమార్గం అనే తేడా లేకుండా అన్నిచోట్లా నిఘా పెట్టాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు కేసులు
కొడాలి నానిపై ఆంధ్రప్రదేశ్(AP)లో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో కొన్ని కేసుల్లో తీవ్రమైన అభియోగాలున్నాయని, నేరం రుజువైతే గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయన విచారణ ప్రక్రియనుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా వివిధ కేసులలో నిందితులుగా ఉన్న వ్యక్తులు దేశం విడిచి పారిపోతారనే బలమైన అనుమానాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటువంటి లుకౌట్ సర్క్యులర్లను జారీ చేస్తుంటుంది.