మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కతోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి 2026 రిలీజ్ టార్గెట్‌గా ఈ మూవీ షూటింగ్ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమాలో మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఆయన పాత్ర కథలో కీలక మలుపు తిప్పే విధంగా ఉండనుందని తెలుస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ‘మెగా 157’గా పిలువబడే ఈ చిత్రానికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి అసలుపేరు శివ శంకర వరప్రసాద్ కావడం, ఆయన తన పేరుతోనే ఈ సినిమాలో నటించనున్నారనే ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.
ఈ టైటిల్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతోంది. చిరంజీవి అభిమానులు ఈ పేరు వినగానే ఎమోషనల్ అవుతున్నారు. ఆయన అసలు పేరు మీద సినిమా చేయడం నిజంగా ప్రత్యేకం అని భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.






