Mana Enadu : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో కుదిరింది. అగ్ర కథానాయకుడు చిరంజీవితో (Chiranjeevi) ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘దసరా’తో సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవికి కథ చెప్పి మెప్పించాడు. అయితే దసరా విడుదల తర్వాతే శ్రీకాంత్ తన అభిమాన కథానాయకుడైన చిరుకి కథ వినిపించారు. రెండో సినిమాగానే ఆయనతో చేయాలనుకున్నారు. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు సెట్ అయ్యింది.
తన మొదటి సినిమాను నానితో తీసిన శ్రీకాంత్ ఓదెల.. రెండో చిత్రాన్ని కూడా నానీతో ‘ది ప్యారడైజ్’ (The Paradise) పేరుతో తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కలిసి సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చిరంజీవి ప్రస్తుతం మరో యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ (vishwambhara) సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
దసరా సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన శ్రీకాంత్ ఓదెల తొలి చిత్రంతోనే తానేంటో నిరూపించుకున్నాడు. సినిమా 6 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. శ్రీకాంత్ డెబ్యూ డైరెక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డు (filmfare awards) దక్కించుకున్నారు. ధరణి క్యారెక్టర్‌లో అదరగొట్టిన నాని ఉత్తమ నటుడు, వెన్నెల పాత్రలో అత్యద్భుతమైన నటనకు గానూ కీర్తి సురేశ్ ఉత్తమ నటి అవార్డును అందుకుంది. ఈ సినిమాలోని ‘ధూమ్ ధామ్’ పాటకు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ అవినాశ్ కొల్లా అవార్డులు అందుకున్నారు. మరి చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల తీయబోయే సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.






