
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ఆసుపత్రుల్లో 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు, తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ఆసుపత్రుల్లో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి.
ఈ డిపార్టుమెంట్లలో ఖాళీలు
ఈ పోస్టులు 17 స్పెషాలిటీలైన అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, రేడియాలజీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మనరీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లలో భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8న ప్రారంభమై సెప్టెంబర్ 22న సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అలాగే జోన్‌ల వారీగా భర్తీ చేపట్టనున్న ఈ పోస్టులలో మల్టీజోన్-1లో 858, మల్టీజోన్-2లో 765 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఇప్పటికే పనిచేస్తున్న వైద్యులకు పోస్టుల భర్తీలో 20 పాయింట్లు కేటాయిస్తామని అధికారులు వివరించారు.
విభాగాల వారీగా పోస్టులు..
కాగా, విభాగాల వారీగా పోస్టులు, ఇతర అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాలని పేర్కొన్నారు. అర్హతలు, వయస్సు, దరఖాస్తు రుసుము, రిజర్వేషన్ వివరాలు MHSRB వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in) అందుబాటులో ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్య రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరతను తీర్చడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.