తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సహా మరికొందరు కీలక నేతలు ఆయన వెంట వెళ్లారు. మొదట ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో వీరంతా పాల్గొంటారు. ఈ సందర్భంగా వారు ఏఐసీసీ అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై హైకమాండ్ తో చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
సింగపూర్ నుంచి దావోస్ కు
గురువారం మధ్యాహ్నం వరకు దిల్లీలోనే వీరంతా ఉంటారు. ఆ తర్వాత వారు అక్కడి నుంచే సింగపూర్ బయల్దేరతారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy), పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అండ్ టీమ్ గురువారం రాత్రికి సింగపూర్ చేరుకోనుంది. ఈనెల 19వ తేదీ వరకు అక్కడ పర్యటించనున్న వీరు.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యానికి పలు సంస్థలతో ఒప్పందాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులపై పలు కంపెనీలతో చర్చించనుంది.
ఆస్ట్రేలియా టూర్
ఇక అక్కడి నుంచి సీఎం అండ్ టీమ్.. స్విట్జర్లాండ్‌లోని దావోవ్ (CM Revanth Davos Tour)కు వెళ్తుంది. దావోస్‌లో ఈనెల 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొంటారు. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలపై చర్చించి రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానిస్తారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని బృందం గురువారం రోజున ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల 23వరకూ బ్రిస్బేన్‌లో పర్యటించనుంది.







