ManaEnadu: తెలంగాణలో కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్లుండి నుంచి (NOV 6) రాష్ట్ర వ్యాప్తంగా కులగణన కార్యక్రమం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్(CM Revanth) అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో బీసీ కులగణన(BC Caste census)కు డెడికేషన్ కమిషన్(Dedication Commission) ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రేవంత్ మరోసారి స్పష్టం చేశారు.
సీఎం సమాలోచనలు
స్థానిక సంస్థల BC రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు(Supreme Court, High Court) తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, PCC చీఫ్ మహేష్ గౌడ్‌తో పాటు ఉన్నతాధికారులతో కలిసి CM తన నివాసంలో సమాలోచనలు జరిపారు. కాగా ఈ నెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల(BC reservations)కు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ వివరాలు సేకరిస్తారు..
ఇదిలా ఉండగా కులగణన(Caste census) కోసం అధికారులు మొత్తం 75 ప్రశ్నల(75 questions)ను సిద్ధం చేశారు. కుటుంబ సభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, మొబైల్, రేషన్ కార్డు నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, భూములు, ఇల్లు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, 5 నుంచి తీసుకున్న లోన్ల గురించి అడుగుతారు. అయితే ఎవరైనా కులం పేరు తప్పుగా నమోదు చేయిస్తే భవిష్యత్తులో అనేక రకాలుగా తీవ్రంగా నష్టం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.