తెలంగాణ రైతులకు శుభవార్త. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ (Rythu Runa Mafi) నగదును నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేయనున్నారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ వేదికగా రైతులపై ఆయన వరాల జల్లు కురిపించనున్నారు. దాదాపు 3 లక్షల మంది రైతులకు రూ.3 వేల కోట్లను నాలుగో విడతగా రుణమాఫీ నగదు విడుదల చేయనున్నట్లు సమాచారం.
రైతు పండుగ ముగింపు వేడుకకు సీఎం రేవంత్
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో నిర్వహిస్తున్న రైతు పండుగ (Rythu Panduga) ముగింపు వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (శనివారం) హాజరు కానున్నారు. అనంతరం అమిస్తాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు రైతు పండుగ వేడుకలను సర్కారు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అమిస్తాపూర్ లో రైతులపై సీఎం వరాలు
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం రేవంత్ (CM Revanth Mahabubanagar Visit) అమిస్తాపూర్ చేరుకుని రైతు పండుగ ప్రదర్శనను తిలకించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. ఈ సభా వేదికగా రుణమాఫీ, రైతు భరోసా (Rythu Bharosa)కు సంబంధించి రైతులకు ముఖ్యమంత్రి తీపి కబురు అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
సీఎం రాకతో భారీ బందోబస్తు
ఇక సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సహా సమీపంలోని రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ సహా ఇతర జిల్లాల నుంచి రైతులను కాంగ్రెస్ కార్యకర్తలు తరలిస్తున్నారు. మరోవైపు సీఎం పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. అదే విధంగా మహబూబ్‌నగర్, భూత్పూర్ మార్గంలో ప్రయాణించే వాహనాలను బైపాస్, జడ్చర్ల మీదుగా దారి మళ్లిస్తున్నారు.