దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇండియా మొత్తం ప్రస్తుతం కొవిడ్ యాక్టివ్ కేసులు 2,710 ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారం రోజులుగా కేరళ (kerala), మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్తగా కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. అత్యంత వేగంగా కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కేరళలో కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రకటించారు. ఆ తర్వాత ఢిల్లీలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.
దేశంలో కరోనా కేసులు 2,710
మే 26న దేశంలో మొత్తం 1,010 కేసులు నమోదు కాగా.. మే 30 నాటికి ఆ సంఖ్య 2,710కి పెరిగినట్లు ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో (covid) కొత్త వేరియంట్లతో భయం అక్కర్లేదని పేర్కొంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం చైనా, థాయ్ లాండ్, సింగపూర్ దేశాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ల ప్రభావం తక్కువగానే ఉన్నట్లు జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్ల నొప్పులు ఉంటాయని చెబుతున్నారు.
మాస్క్ ధరించాలని ఆరోగ్య శాఖ సూచనలు
తెలంగాణలో (telangana) ఇప్పటి వరకు మూడు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 16 కేసులు నమోదు కాగా.. మిజోరం, అస్సాంలో ఇద్దరు చొప్పున కొవిడ్ బారిన పడ్డారు. దేశంలో మొత్తం 2,710 కేసులు నమోదు కాగా.. అత్యధికంగా కేరళలో 1,147 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 424. ఢిల్లీలో 294, గుజరాత్ లో 223, తమిళనాడు, కర్ణాటకలో 148 కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. జాగ్రత్తలతోనే కరోనా సోకకుండా ఉండొచ్చని బయటకు వెళ్లినపుడు ఇన్ ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్ ధరించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు.






