క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. క్రికెట్ ను ఒలింపిక్స్(Olympics 2028)లో చూడాలని చాలా మంది అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నారు. ఇటీవలే ఇది సాధ్యమవుతుందనే సంకేతాలు వచ్చాయి. ఇక తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. క్రికెట్ గేమ్(Cricket in Olympics)ను ఎట్టకేలకు ఒలింపిక్స్‌లో మళ్లీ చూడబోతున్నాం. 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానుంది.
ఆరు జట్లు.. టీ20 ఫార్మాట్
బుధవారం రోజున అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు(International Olympic Committee Executive Board) మీటింగ్‌లో క్రికెట్ సహా కొత్తగా ఆరు క్రీడలను పోటీల్లో చేర్చేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 351 మెడల్ ఈవెంట్లు నిర్వహించాలని నిర్ణయించింది. క్రికెట్లో ఆరు జట్లు పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపింది. పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు చొప్పున జట్లతో క్రికెట్ పోటీలను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది.
12 జట్లు.. 100 దేశాల నుంచి సెలక్షన్
ఒక్కో జట్టుకు 15 మంది స్క్వాడ్‌ను అనుమతించనున్న బోర్డు.. ఐసీసీ (ICC) ఫుల్ మెంబర్స్‌గా ఉన్న 12 జట్లతో సహా దాదాపు 100 దేశాల నుంచి జట్లను సెలెక్ట్ చేయనుంది. క్రికెట్ పోటీలకు వేదికలు, షెడ్యూల్ ఫైనల్ కాలేదు. మరోవైపు క్వాలిఫికేషన్ ప్రక్రియ కూడా ఇంకా డిసైడ్ కాలేదు. మొత్తానికి ఒలింపిక్స్ లో క్రికెట్ ఆటను చూడాలనుకుంటున్న కోట్లాది మంది క్రీడాభిమానుల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది.






