బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారి పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తోంది. ఈ తుపానుకు ‘ఫెయింజల్’ తుపాను (Cyclone Fengal) అని భారత వాతావరణ శాఖ నామకరణం చేసింది. మరికొన్ని గంటల్లో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉందని.. దీనిప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
చెన్నైపై ఫెయింజల్ ప్రభావం
ఫెయింజల్ ప్రభావంతో చెన్నై (Heavy Rains in Chennai) నగరం అతలాకుతలంగా మారింది. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతున్నందున శనివారం సాయంత్రం 5 గంటల వరకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. శనివారం సాయంత్రం నాటికి ఈ తుపాను కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం దాటొచ్చని చెన్నై వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
ఏపీపై ఫెయింజల్ ఎఫెక్ట్
మరోవైపు ‘ఫెయింజల్’ తుపాను కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు (AP Rain Alert) కురిసే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది.
ఫెయింజల్ తుపానుపై సీఎం చంద్రబాబు సమీక్ష
వాతావరణ శాఖ హెచ్చరికలతో ఫెయింజల్ తుపాను (Cyclone Fengal)పై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ, కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైం గవర్నెన్స్ అధికారుల సమావేశమై.. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలని సూచించారు.






