Mana Enadu : తుర్కియేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని ఓ ఆయుధ తయారీ కేంద్రంలో మంగళవారం రోజున భారీ పేలుడు (Turkey Explosion News) జరిగింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బల్కిసెర్ ప్రావిన్స్‌లోని కవక్లి అనే పట్టణ శివార్లలో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తుర్కియే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పరిశ్రమలో మందుగుండు, ఫ్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారని పేర్కొన్నాయి.
గాల్లోకి ఎగిసిన అగ్నిగోళం
తుర్కియే కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8.25 నిమిషాలకు ఈ పేలుడు (Turkey Blast News) సంభవించింది. పేలుడు జరిగిన సమయంలో భారీ అగ్నిగోళం గాల్లోకి ఎగిసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాద ధాటికి JSR Explosives ఫ్యాక్టరీలోని ప్రధాన భవనం పూర్తిగా కుప్పకూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఓవైపు అగ్నిమాపక దళాలు మంటలు ఆర్పడంలో నిమగ్నం కాగా.. ఇతర రెస్క్యూ టీమ్స్ ఆ ప్రాంతంలో ఉన్న వారిని రక్షించడంలో బిజీ అయ్యాయి.
ఎంత మంది ఉన్నారు?
ఇక ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బ తిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఆ దేశ ఇంటీరియర్ మంత్రి తెలిపారు ప్రమాదానికి గల కారణాలను వెంటనే చెప్పలేమని, దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు ప్రమాదం జరిగిన వేళ ఫ్యాక్టరీలో ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.






