
వేములవాడ రాజన్న గోశాలలో (Goshala) కోడెలు వరుసగా చనిపోతూనే ఉన్నాయి. శుక్రవారం అనారోగ్యంతో 8 కోడెలు చనిపోగా.. శనివారం 5 కోడెలు మృతి చెందాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టింపులేమి తనంతో కోడెలు చనిపోతున్నాయి. సరైన ఆవాసం, మేత ఉండటం లేదు. దీంతో రెండు రోజుల్లోనే 13 కోడెలు చనిపోయాయి. గోశాలలో కోడెలు ఉండాల్సిన వాటి కంటే కంటే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి రైతులకు కోడెల పంపిణీని నిలిపివేశారు. దీంతో సామర్థ్యం కంటే ఎక్కువయ్యాయి. అక్కడ షెడ్లలో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కోడెల చనిపోవడంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పశువైద్య శిబిరం పెట్టి కోడెలకు వైద్యం అందిస్తున్నారు. దీంతో అక్కడి కోడెలకు ఆహారం లేక నీరసించి కోడెలు చనిపోయినట్లు తెలుస్తోంది.
కోరికలు తీరితే కోడెల మొక్కు తీర్చుడే..
వేములవాడ రాజన్న (vemulawada rajanna temple) కోరిన కోర్కెలు తీర్చితే నిజ కోడెను సమర్పించుకుంటామని భక్తులు మొక్కుకుంటారు. దీంతో వారు కోడెను సమర్పిస్తారు. రాజన్న ఆలయానికి కోడెలు ఇస్తుండగా.. వాటిని అధికారులు తిప్పాపూర్ లోని గోశాలకు తీసుకెళ్లి సంరక్షిస్తుంటారు. అయితే ఆరు నెలల క్రితం కోడెల పంపిణీ లో అవకతవకలు జరిగాయి. ఒకే వ్యక్తికి 60 జీవాలు అందించడం వివాదాస్పదం కావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో గోశాలలో కోడెల సంఖ్య పెరిగిపోయింది. అక్కడ కనీస వసతులు కరువయ్యాయి.
పరిమితికి మించి కోడెలు
తిప్పాపూర్ ( tippapur goshala) లో ఉన్న గోశాలలో 400 నుంచి 500 కోడెలు ఉండేందుకు స్థలం ఉంది. కానీ ప్రస్తుతం అందులో 1250కి పైగా కోడెలను ఉంచుతున్నారు. ఇరుకు స్థలంలో కోడెలను ఉంచడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. వాటికి సరైన తాగునీటి వసతి, నీడ, మేత ఉండటం లేదు. దీంతో పాటు అపరిశుభ్ర వాతావరణం లో ఉంటున్నాయి. ఎక్కువ గోవులు, తక్కువ ప్లేస్ తో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతున్నాయి. రోజూ 400 కోడెలకు మాత్రమే పచ్చగడ్డి అందిస్తున్నట్లు అధికారులు చెబుతుండగా భక్తులు మండిపడుతున్నారు. అర్ధాకలితో కోడెలు చనిపోవడాన్ని చూసీ తట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆలయ అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.