టీ20 క్రికెట్లో మరో టైటిల్ పోరుకు సమయం ఆసన్నమైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(Womens Premier League- 2025) 3వ సీజన్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ (March 15) జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్(DC) వర్సెస్ ముంబై ఇండియన్స్(MI) మధ్య ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మొదలు కానుంది. తొలి సీజన్ ఫైనల్లో ముంబై చేతిలో కంగుతిన్న ఢిల్లీ.. ఈసారి ఎలాగైనా కప్పును ఒడిసిపట్టాలనే పట్టుదలతో ఉంది. ఈసారి ఆ జట్టు ప్లేయర్లంతా ఫుల్ ఫామ్‌లో ఉండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం కాగా.. ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి ఫైనల్ చేరిన హర్మన్ సేన సొంత మైదానంలో కప్పును ఎగరేసుకుపోవాలని ఉవ్విళ్లూరుతోంది.
హోరాహోరీ ఫైట్ తప్పదు
బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లూ పటిష్ఠంగానే ఉన్నాయి. MI తరఫున ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఆల్ రౌండర్లు నటాలీ సీవర్ బ్రంట్ (493R, 9W), హీలీ మాథ్యూస్ (304R, 17W) MI విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (236R) బ్యాట్‌తోపాటు తన వ్యూహాలతో మైదానంలో ప్రత్యర్థి జట్లను తిప్పలు పెడుతోంది. ఇక స్పిన్నర్ అమెలియా కెర్ (16 వికెట్లు) మరోసారి బ్రబౌర్న్‌లో సత్తా చాటితే ఢిల్లీకి కష్టాలు తప్పవు.

అటు DC కూడా తక్కువేమీ తినలేదు. ఆరంభంలోనే తనదైన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసే షెఫాలీ వర్మ (300R) మంచి టచ్‌లో ఉండగా కెప్టెన్ మెగ్ లానింగ్ (263R), నిలకడగా రాణిస్తోంది. ఈ ఓపెనింగ్ ద్వయాన్ని అడ్డుకోకుంటే ముంబై భారీ మూల్యం చెల్లించక తప్పదు. మొత్తంగా రెండు జట్ల మధ్య హోరాహోరీ ఫైట్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

తుది జట్ల అంచనా
Mumbai Indians: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (C), అమంజోత్ కౌర్, యాస్తికా భాటియా (WK), సజీవన్ సజన, G కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్/పరుణికా సిసోడియా
Delhi Capitals: మెగ్ లానింగ్ (C), షఫాలీ వర్మ, జెస్ జోనాస్సెన్, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, సారా బ్రైస్ (WK), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, టిటాస్ సాధు/ఎన్ చరణి






