ఐపీఎల్-2025లో వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(DC), లక్నో సూపర్ జెయింట్స్(LSG) మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో DC ఒక వికెట్ తేడాతో బంపర్ విక్టరీ అందుకుంది. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు 65 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో ఓటమి తప్పదనుకున్న చోట ఇంపాక్ట్ ప్లేయర్(Impact Player)గా బరిలోకి దిగిన DC ఆటగాడు అశుతోష్ శర్మ(Ashutosh Sharma) అద్భుతం చేశాడు. తన విరోచిత ఇన్నింగ్స్‌తో DCకి సంచలన విజయాన్ని అందించాడు. మరో ఎండ్‌లో ఆల్ రౌండర్ విప్రజ్ నిగమ్ (39) అతడికి అండగా నిలిచాడు.
అశుతోష్.. ఆఖరి 11 బంతుల్లో 44 పరుగులు
తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసిన అశుతోష్ ఆఖరి ఓవర్లో సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అశుతోష్ తన ఎదుర్కొన్న ఆఖరి 11 బంతుల్లో ఏకంగా 44 పరుగులు చేయడం విశేషం. మొత్తంగా 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా DC.. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో అందుకుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన LSG నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్(72), నికోలస్ పూరన్(75 పరుగులు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్(Starc) మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా.. విప్రాజ్ నిగమ్, ముఖేష్ కుమార్ తలో వికెట్ సాధించారు.
నేడు టైటాన్స్ వర్సెస్ కింగ్స్
ఇక ఇవాళ IPLలో గుజరాత్ టైటాన్స్(GT)తో పంజాబ్ కింగ్స్(PK) తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచుల్లో తలపడ్డాయి. GT 3, PBKS 2 మ్యాచుల్లో గెలిచాయి. గత సీజన్లో KKRకు కప్ సాధించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో PBKSకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. GTకి శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడు. సహజంగా స్పిన్ ట్రాక్ అయిన అహ్మదాబాద్‌లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.








