దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దీంతో GRAP-4 నిబంధనలు తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు స్కూళ్ల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలు (Delhi Schools)ఫిజికల్ మోడ్‌లో నడుస్తాయని, విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు (డిసెంబరు 6) నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి.
ఢిల్లీలో కాలుష్యం కారణంగా GRAP-4 నిబంధనలు గతంలో అమలు చేసిన విషయం తెలిసిందే. ఆ నింబధనల ప్రకారం. ఆన్‌లైన్ మోడ్‌లోనే స్కూళ్లు నిర్వహించారు. ఇప్పుడు గాలి నాణ్యత సూచిక (AQI) స్థాయి మెరుగుపడడంతో GRAP-4 రూల్స్ కొన్నింటిని తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని తర్వాత ఇప్పుడు స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ చదువుల విధానాన్ని రద్దు చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది.
గురువారం ఢిల్లీలో AQI 165గా నమోదైంది. AQI లెవల్ 300 కంటే తక్కువగా ఉండడంతో స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. AQI తక్కువగా ఉండడంతో సుప్రీంకోర్టు కూడా GRAP-4 పరిమితులను ఎత్తివేసేందుకు అంగీకరించింది. శుక్రవారం నుంచి ఢిల్లీ పాఠశాలల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభమవుతాయని విద్యా శాఖ డైరెక్టరేట్ తెలిపింది. 12వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లోని పిల్లలకు ఇకపై ఆన్‌లైన్ తరగతులు నిర్వహించబడవని స్పష్టం చేసింది.






