
రాష్ట్ర ప్రజల భవిష్యత్ కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. విద్యార్థులకు క్వాలిటీ ఉన్నత విద్య అందిస్తున్నామని, మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పైనున్న స్వర్గం కిందికి దించేలా తెలంగాణను అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించారు. చింతకాని మండలం కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. మహిళలకు రూ.5.93 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ చేశారు.
విద్యార్థుల భవిష్యత్ కోసం యంగ్ ఇండియా స్కూల్స్
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఒక్క మధిర నియోజకవర్గంలోనే రూ.10 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించిందని వివరించారు. ఈనెల 12 నుంచి 20వరకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ పండుగు జరుగుతుందని అన్నారు. మొదటి దశలో ఏడాదిలోనే రాష్ట్రంలో రూ.20వేల కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు పూర్తి చేశామన్నారు. 2వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పతి కోసం మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేసి ఆదాయం వచ్చేలా కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో 650 బస్సులు నడిపిస్తున్నాం
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ 650 బస్సులు నడిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మైక్రో ఇండస్ట్రీస్ కేవలం మహిళా సంఘాల స్థాపించేలా ప్రణాళికలు చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేసే యూనిఫామ్స్ ను మహిళా సంఘాలకు అందజేసి వారితో కుట్టించి ఆర్థిక భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఊరంతా వచ్చి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ముగ్గులు పోసి వారిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.