
ఏపీలో కూటమి సర్కార్ పట్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతంలో వైసీపీ సర్కారు ప్రవర్తించిన తీరు, ఇప్పుడు కూటమి సర్కారు అందిస్తున్న సాయం మరిచిపోవద్దని సూచించారు. కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు ఏడాది పూర్తవుతున్నా సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu)ను తెలుగు సినీ పెద్దలు ఒక్కసారైనా కలిశారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం సినిమా రంగం అభివృద్ధిని ఆకాంక్షిస్తుందని, వ్యక్తుల ప్రయోజనాలను కాదన్నారు. మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగానే స్వీకరిస్తాను అని ఘూటుగా హెచ్చరించారు.
అందరూ కలిసిరావాలి..
తమకున్న డిమాండ్లు నెరవేర్చాలని, (exhibitors) ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. లేకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ పెడతామని ప్రకటించారు. ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన సమావేశం తర్వాత అలాంటిదేమీ లేదని థియేటర్లు యథావిధిగానే నడుస్తున్నాయని ప్రకటించారు. కొంతమంది తమ చిత్రాలు విడుదల అవుతున్న సందర్భంలో మినహా సినిమా రంగం డెవలప్ మెంట్ కోసం ముందుకు రావడం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. అందరూ కలిసి రావాలని తాను పిలుపునిచ్చినా ఇప్పటి వరకు సానుకూలంగా స్పందించలేదన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందుల్ని నిర్మాతలు మరిచిపోతే ఎట్లా అని ప్రశ్నించారు.
ఏ ఒక్కరూ పత్యేకంగా కలవొద్దు..
తెలుగులో బడా నిర్మాతలు (film producers) కలిసి ఉంటేనే డెవలప్ చేయొచ్చని ఇంతకుముందే చెప్పాను. కానీ ఇప్పటి వరకు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తున్నారు. కలిసి ఉమ్మడిగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ పై ఏ ఒక్కరూ కూడా మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను తాను తీసుకుంటున్నానని కచ్చితంగా గుర్తు ఉంచుకుంటానని చెప్పారు. థియేటర్ లలో, మల్టీఫ్లెక్స్ ల్లో టికెట్ రేట్లతో పాటు వివిధ ఇబ్బందుల పరిష్కారానికి తాను ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. తనను ప్రత్యేకంగా ఏ ఒక్కరూ కలవాల్సిన పని లేదని అన్నారు.