
Mana Enadu : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం అని అన్నారు. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని కోరారు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలను ఆపాదించొద్దని సూచించారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు ఇండస్ట్రీని వాడుకోవద్దని చెప్పారు.
మా భేటీ చాటు మాటు వ్యవహారం కాదు
తెలంగాణ సీఎం (CM Revanth Reddy)తో భేటీ చాటు మాటు వ్యవహారం కాదని దిల్ రాజు (Dil Raju) అన్నారు. చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వక చర్చ జరిగిందని తెలిపారు. తెలంగాణ సీఎంతో భేటీపై చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి పయనంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి, తమ బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కోరారని ఈ సందర్భంగా దిల్ రాజు వెల్లడించారు.
మాకు రాజకీయాలు ఆపాదించొద్దు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ (Global Entertainment Hub) హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం బలంగా సంకల్పించారు. దాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ స్వాగతించింది. ఆయన సంకల్పంలో మేమూ భాగమవుతామని మాటిచ్చాం. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగొద్దు. పరిశ్రమకు లేని పోని రాజకీయాలను ఆపాదించొద్దు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తోన్న మా పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని దిల్ రాజు అన్నారు.
కేటీఆర్ ఏమన్నారంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) వ్యవహారంపై ఇటీవల మరోసారి స్పందించిన కేటీఆర్.. కేవలం ప్రచారం కోసం, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అలా మాట్లాడారని అన్నారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే ఆయన పాకులాడుతున్నారని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లతో సెటిల్ చేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడట్లేదని కేటీఆర్ ఆరోపించాన నేపథ్యంలో దిల్ రాజు ఇవాళ స్పందించారు.