Mana Enadu : హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 సినిమా (Pushpa 2) బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో (Sandhya Theatre Stampede Case) రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో ప్రాణాల కోసం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలుడిని పరామర్శించేందుకు, బాధితుల కుటుంబానికి అండగా నిలిచేందుకు పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్తున్నారు.
రేవతి కుటుంబానికి అండగా
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లిన ఆయన సోమవారం రాత్రి ఇండియాకు వచ్చారు. ఇవాళ ఆయన శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం దిల్ రాజు (Dil Raju) మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆసక్తి ఉంటే రేవతి భర్తకు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా పర్మినెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని ప్రకటించారు.
వారధిగా పని చేస్తాను
“సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా బాధాకరం. అమెరికా నుంచి నిన్న రాత్రే వచ్చాను. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిశాను. త్వరలోనే అల్లు అర్జున్ (Allu Arjun)ను మీట్ అవుతాను. సినీ పరిశ్రమతోపాటు ప్రభుత్వ పెద్దలను త్వరలోనే కలిసి ఈ సమస్యకు షరిష్కారం చూపే ప్రయత్నం చేస్తా. సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటాను. శ్రీతేజ్ కు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు’’ అని దిల్ రాజ్ తెలిపారు.






