నిజానిజాలు తెలియకుండా ట్రోలింగ్ ఎలా చేస్తారని ట్రోలర్లపై దర్శకుడు, నయనతార భర్త విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) మండిపడ్డారు. ఇకనైనా వెక్కిరింపులు ఆపాలని ఘాటుగా స్పందించారు. ‘నానుమ్ రౌడీ దాన్’ (naanum rowdy dhaan)(తెలుగులో నేనూ రౌడీ నే) సినిమాను హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) మెచ్చుకున్నారంటూ ఇటీవల విఘ్నేశ్ శివన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సినిమాకు అంత సీన్ లేదని, ఆయన అబద్ధం చెబుతున్నారంటూ ట్రోల్స్ మొదలయ్యాయి.
పూర్తి విషయాన్ని ఆరోజు చెప్పలేకపోయా..
ఈ ట్రోలింగ్‌పై తాజాగా విఘ్నేష్ శివన్ (Vignesh Shivan on trollers) స్పందించారు. నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. ‘ఎన్నై అరిందాల్ (తెలుగులో ఎంతవాడు గాని) సమయం నుంచి అజిత్ నాకు తెలుసు. ఆ సినిమా కోసం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ (Gautham Vasudev Menon) పాట రాయమని నన్ను అడిగితే రాసిచ్చా. ఆ సమయంలోనే అజిత్‌తో నాకు పరిచయం ఏర్పడింది. నేను తీసిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా విడుదలయ్యాక ఆయనతో మాట్లాడా. ‘విశ్వాసం’ షూట్‌లో భాగంగా ఆయన హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా కలిశా. నానుమ్ రౌడీ దాన్ తాను చూశానని ఎంతో బాగుందని ఆయన అన్నారు. ఇది నిజం. మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఈ మొత్తం విషయాన్ని చెప్పడానికి సమయం లేదు. అగ్ర దర్శకులతో కలిసి ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని పూర్తిగా వివరిస్తూ సమయాన్ని ఎక్కువగా తీసుకోవడం సరికాదు. అందువల్లే పూర్తి విషయాన్ని ఆరోజు చెప్పలేకపోయా. కాబట్టి, ఇకనైనా ఎగతాళి చేయడం, వెక్కిరించడం ఆపండి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ పోస్ట్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






