Mana Enadu : దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు(Diwali Celebrations) ప్రారంభమయ్యాయి. అయితే భారతదేశంలోనే కాకుండా ఈ వేడుకలు అగ్రరాజ్యం అమెరికాలోనూ జరుగుతున్నాయి. ఆ దేశ అధ్యక్ష అధికారిక నివాసం వైట్‌హౌస్(US White House Diwali)లో తాజాగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, అధికారులతో సహా 600 మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు.
అమెరికాలోని ప్రతిభాగంలో దక్షిణాసియా వాసులు
ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మాట్లాడుతూ దక్షిణాసియా అమెరికన్ సమాజాన్ని కొనియాడారు. తన కార్యవర్గం విభిన్నమైన జాతులతో అమెరికాను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇక ఈ వేడుకల సందర్భంగా భారతీయ అమెరికన్ యూత్ యాక్టివిస్ట్ సుశ్రుతి అమూల, అమెరికా సర్జన్ జనరల్ వివేక్ హెచ్.మూర్తి తదితరులు ప్రసంగించారు. అమెరికాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న దక్షిణాసియా వాసులు అమెరికన్ల జీవితాల్లో ప్రతి భాగాన్ని సుసంపన్నం చేశారని బైడెన్ తెలిపారు.
Happening Now: President Biden delivers remarks at a White House celebration of Diwali. https://t.co/gTKjvtzCEi
— The White House (@WhiteHouse) October 28, 2024
చాలా సంతోషంగా ఉంది
“2016 నవంబర్‌లో దక్షిణాసియా అమెరికన్లపై ద్వేషం, శత్రుత్వం ఏర్పడిన సమయంలోనే జిల్ బైడెన్, నేను మొదటి దీపావళి వేడులను వైస్ ప్రెసిడెంట్ నివాసంలో జరిపాం. అప్పుడు ఐరిష్ కాథలిక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, హిందువులు(Hindus), బౌద్ధులు, జైనులు, సిక్కులు హాజరయ్యారు. ఇప్పుడు దీపావళి వేడుకలు గర్వంగా, ఘనంగా శ్వేతసౌధంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది.” అని బైడెన్ అన్నారు.
బ్లూరూమ్ లో దీపావళి వేడుకలు
శ్వేతసౌధంలోని బ్లూరూమ్(Blue Room)లో ఈ వేడుకలు జరిపారు. వేడుకల సందర్భంగా ఆ ప్రదేశాన్ని దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. దాదాపు 600 మందికిపైగా అతిథులు ఈ వేడుకలో భాగమయ్యారు. 2003లో జార్జి బుష్ శ్వేతసౌధంలో తొలిసారి దీపావళి వేడుక నిర్వహించగా.. ఆ తర్వాత బరాక్ ఒబామా స్వయంగా ఓవల్ ఆఫీస్‌లో దీపం వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఆ తర్వాత ఈ సంప్రదాయాన్ని ట్రంప్ (Donald Trump) కొనసాగించగా ఇప్పుడు బైడెన్ కూడా దీపావళి వేడుక జరుపుతున్నారు.