Mana Enadu : తెలంగాణ టీచర్ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్. డీఎస్సీ (DSC Teacher Postings 2024) ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ ను ప్రభుత్వం వాయిదా వేసింది. పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలు త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది.
డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు మంగళవారం రోజున (అక్టోబర్ 15వ తేదీ) పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. అయితే.. కౌన్సెలింగ్(DSC Counselling)ను వాయిదా వేస్తున్నట్లు తాజాగా విద్యా శాఖ ప్రకటించడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన మెగా డీఎస్సీ(Telangana Mega DSC)ని ప్రకటించింది. 11,062 పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టింది. జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించింది. మొత్తం 11,062 పోస్టులకు గాను సుమారు 2లక్షల 46వేల మంది పరీక్షలు రాశారు. కేవలం ఏడు నెలల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఇటీవలే దాదాపు పది వేల మందికి పైగా నియామకపత్రాలను అందించారు.
అర్హులైన వారిని ఎంపిక చేసి అక్టోబర్ 1 నుంచి 5 వరకు జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన వారిని గుర్తించి ఒక్కొక్కరికి ఒక్కో పోస్టును మాత్రమే కేటాయిస్తూ పోస్టులను భర్తీ చేసిన సర్కార్.. ఇందులో భాగంగా ముందుగా స్కూల్ అసిస్టెంట్(School Assistant)గా ఎంపికైన వారిని, ఎస్జీటీ పోస్టుల ఫలితాలు, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,515 స్కూల్ అసిస్టెంట్, 685 భాషా పండితులు.. 145 పీఈటీ, 6,277 ఎస్జీటీ, 103 స్పెషల్ ఎడ్యుకేషన్, 281 ఎస్జీజీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేసినట్టు ప్రకటించింది.