ఓ రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని సూచించారు. రుణమాఫీపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సిద్ధమా అని సవాల్ విసిరారు. శనివారం మహబూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి పర్యటించారు. అమిస్తాపూర్‌లో రైతు పండుగ సదస్సులో సీఎం ప్రసంగించారు. రైతుల కోసం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. ఇంకా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తుచేశారు.
పాలమూరులో ప్రజల కష్టాలు తీరలేదు
సీఎం మాట్లాడుతూ ‘ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది. సరిగ్గా ఏడాది క్రితం మీరంతా ప్రజాప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లు వేశారు. నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పాలమూరులో కృష్ణమ్మ పారుతున్నా ప్రజల కష్టాలు తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు ముంబయి, హైదరాబాద్‌కు వలస పోయారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత… ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ సీఎం అయ్యారు’ అని అన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ లో సీనియర్లందరూ జూనియర్ అయినా తనకు సహకరిస్తున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఏ రాష్ట్రంలో అయినా ఇంత రుణమాఫీ చేశారా?
బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం రైతురుణమాఫీని పూర్తి చేసిందా అని ప్రశ్నించారు. వడ్డీతో సహా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని కేసీఆర్ అనలేదా అని నిలదీశారు. తమ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే రూ.500 బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చిందన్నారు. ‘గత ప్రభుత్వం రూ.1.02 లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టింది. మూడేళ్లు నిండకుండానే ఆ ప్రాజెక్టు కూలింది. ఈ ఏడాది తెలంగాణలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం ఇది. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఇంత రుణమాఫీ చేశారా? అని ప్రధాని మోదీ, కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నా’ అన్నారు. సాగుకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది (Congress) అని తెలిపారు.
మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు
‘గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా.. ప్రాజెక్టులు కట్టలేదా.. పరిశ్రమలు నిర్మించలేదా..? నా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని భావించా. మాయగాళ్ల మాటలు విని పరిశ్రమలను అడ్డుకుంటున్నారు. మాయగాళ్ల మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుకున్నారు. జిల్లాను అభివృద్ధి చేయాలంటే భూసేకరణ చేయాలా? వద్దా? అధికారులను కొడితే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవా? ’ అని ప్రశ్నించారు. ‘మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు. కేసీఆర్‌కే గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. కేటీఆర్, హరీశ్‌రావుకు పెద్దపెద్ద ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ప్రజలను రెచ్చగొట్టి కేసుల పాల్జేసి వాళ్లు వెళ్లి ఫామ్‌హౌస్‌లో ఉంటారు. పాలమూరు ప్రజలకు ఉపాధి కల్పిస్తామని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటాని ఉద్ఘాటించారు.
https://twitter.com/revanth_anumula/status/1862822179504615775






