
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్ (V Narayan)ను కేబినెట్ నియామకాల కమిటీ నియమించింది. ప్రస్తుతం ఇస్రోకు నాయకత్వం వహిస్తున్న ఎస్.సోమనాథ్ నుంచి జనవరి 14వ తేదీన నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ తెలిపింది. కొత్తగా నియామకమైన నారాయణ్ కు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
రెండేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్ పదవిలో
తమిళనాడులోని కన్యాకుమారి నారాయణన్ స్వస్థలం. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో క్రయోజెనిక్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేసిన ఆయన.. 2001లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇక డాక్టర్ వి.నారాయణన్ ఇస్రోలో నాలుగు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఇక ఆయన ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు.
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో భాగం
రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ చోదక వ్యవస్థల్లో అపార అనుభవం ఉన్న నారాయణ్.. ప్రస్తుతం ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ)కు నేతృత్వం వహిస్తున్నారు. ద్రవ, సెమీ క్రయోజెనిక్, క్రయోజెనిక్ చోదక వ్యవస్థల అభివృద్ధిలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-2, 3 వాహకనౌకల రూపకల్పనలోనూ నారాయణ్ కీలక పాత్ర పోషించారు. ఆదిత్య-ఎల్1, చంద్రయాన్-2, చంద్రయాన్-3లోని చోదక వ్యవస్థల అభివృద్ధిలో కూడా ఆయన భాగమయ్యారు.