Mana Enadu : హైదరాబాద్ ఫార్ములా – ఈ కారు రేసింగ్ కేసు(Formula E Race)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసి.. వారిని జనవరి 2, 3వ తేదీల్లో విచారణకు రావాలని ఆదేశించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది.
అసలేం జరిగింది?
హైదరాబాద్ ఈ-కారు రేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ (Dana Kishore) ఏసీబీకి ఫిర్యాదు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
రాజకీయ కుట్రతో కేసు
దీనిపై 20వ తేదీన విచారణ జరిపిన హైకోర్టు కేటీఆర్ (KTR Arrest) ను అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం రోజున క్వాష్ పిటిషన్ పై మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ.. రాజకీయ కుట్రతో అన్యాయంగా ఈ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు.
31కి విచారణ వాయిదా
అనంతరం కేటీఆర్ పిటిషన్‌పై ఏసీబీ తరఫున డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కౌంటర్ దాఖలు చేసి ఎఫ్ఐఆర్లోని పలు అంశాలను పునఃప్రస్తావించారు. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున కోర్టు (Telangana High Court) జోక్యం చేసుకొని నిందితులకు ఊరట కలిగేలా ఉత్తర్వులివ్వడం సరికాదని ఆయన తెలిపారు. ఇలాంటి విషయాల్లో కోర్టులకు పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయని గతంలో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు. ఈ వాదన అనంతరం ఏసీబీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు.. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.







