Mana Enadu : వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కీలక వ్యాఖ్యలు చేస్తూ తీర్పు వెలువరించింది. కార్యనిర్వహక అధికారి జడ్జి కాలేరని వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించి, వాళ్ల ఇళ్లను కూల్చివేయాలని నిర్ణయించే అధికారం కూడా వారికి లేదని స్పష్టం చేసింది.
అధికారులు జడ్జిలా వ్యవహరించొద్దు
అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి.. జడ్జిలా వ్యవహరించి వారి ఇళ్లను కూల్చివేయడం (Demolitions) తగదని సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందన్న న్యాయస్థానం.. కూల్చివేత ప్రక్రియను వీడియో తీయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేవలం నిందితులు లేదా దోషులుగా ఉన్నందున ప్రజల ఇళ్లను కూల్చివేస్తే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది.
నోటీసులు లేకుండా కూల్చొద్దు
‘ముందస్తు షోకాజ్ నోటీసు లేకుండా, నోటీసు అందజేసిన నాటి నుంచి 15 రోజుల్లోగా కూల్చివేతలు జరపకూడదు. కూల్చివేత ప్రక్రియను వీడియో రికార్డు చేయాలి. రాజ్యాంగం, క్రిమినల్ చట్టం ప్రకారం నిందితులు, దోషులకు కొన్ని హక్కులు ఉన్నాయి’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
హాట్ టాపిక్‌గా బుల్డోజర్ యాక్షన్
దేశవ్యాప్తంగా కొంత కాలంగా ‘బుల్డోజర్’ చర్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బుల్డోజర్ న్యాయం (Bulldozer justice) పేరుతో పలు రాష్ట్రాలు నిందితుల ఇళ్లను కూల్చి వేస్తున్నాయి. మొదట ఇది యూపీలో షురూ అయింది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేయడం మొదలు పెట్టాయి. నిందితుల ఇళ్లు, ఇతర ఆస్తులపైకి బుల్డోజర్లు పంపడాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే తప్పుబట్టింది. అక్రమంగా ఓ కట్టడాన్ని ధ్వంసం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని హెచ్చరించింది.






