దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekar Kommala)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆయన కథలు, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతను బాగా ఆకట్టుకుంటాయి. అలాంటి శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమాల్లో ‘హ్యాపీ డేస్’(Happy Days ) ఒకటి. 2007లో వచ్చిన ఇంజినీరింగ్ కాలేజ్ జీవితం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, అప్పట్లో యువతను ఊపు ఊపేసింది.
ఈ సినిమాలో నిఖిల్(Nikhil), వరుణ్ సందేశ్(Varun Sandesh), తమన్నా(Tamannah) తదితరులు నటించారు. అలాగే నిఖిల్ సరసన టామ్‌బాయ్ గెటప్‌లో నటించిన ‘అప్పు’ (Appu) పాత్రతో గాయత్రీ రావు(Gayatri Rao) మంచి గుర్తింపు పొందింది. అప్పట్లో ఆమె పాత్రతో ప్రేక్షకులపై తరగని ముద్ర వేసుకుంది. ఆమె అసలు పేరు గాయత్రీ రావు, ఆమె సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చింది.

ఆమె తల్లి బెంగుళూరు పద్మ, తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చిన గాయత్రీకి ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కొంత గ్యాప్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’, పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాల్లో చిన్నపాటి పాత్రల్లో కనిపించారు.

ఇంకా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన గాయత్రీ, ఆఫర్లు తగ్గడంతో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి ఆమె తెరపై కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా తక్కువగా కనిపిస్తూ పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితమైంది.






