పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Sessions 2025) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత శుక్రవారమే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశంలో 60 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను (New Income Tax Bill) చట్టం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకొచ్చేందుకు కేంద్రం చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో త్వరలో పార్లమెంట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు శనివారం రోజున సభలో ప్రకటించారు.
ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాక.. మరింత పరిశీలన కోసం హౌస్ ప్యానెల్‌కు పంపనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పన్ను చట్టాలను సరళీకృతం చేయడమే కొత్త బిల్లు లక్ష్యమని ఆర్థిక మంత్రి (Nirmala Sitharaman) స్పష్టం చేశారు. కొత్త సెస్సును మాత్రం ప్రవేశపెట్టబోమని తేల్చి చెప్పారు. అయితే కొత్త బిల్లులో అనేక సవరణలు ఉంటాయని.. ప్రజలకు అనుకూలంగా ఉంటుందని నిర్మలమ్మ చెప్పుకొచ్చారు.






