గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాత బస్తీ (Old city)లో గల గుల్జార్ హౌస్‌లో ఘోర అగ్నిప్రమాదం (Fire accident) వలన ఒకే కుటుంబంలో 17 మంది మృతి చెందగా.. అందులో ఏడుగురు చిన్నారులు సజీవదహనం అయిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏడుగురు చిన్నారులు ఉండటం అందరినీ తీవ్ర కలతకు గురిచేసింది.
షార్ట్ సర్క్యూటే కారణం..కానీ!
ఈ కేసు విచారణలో భాగంగా గుల్జార్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక జువెల్లరీ షాపులో షార్ట్ సర్క్యూట్ (short circuit) కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ మంటలే క్రమంగా పై అంతస్తుకు వ్యాపించాయి. భవనంలో ఒకేదారిలో ఇరుకైన మెట్ల మార్గం ఉంది. అది కూడా మంటలు, పొగ(smoke) తో నిండిపోవడంతో పై అంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోయింది. దీంతో భవనం మొత్తం దట్టమైన పొగతో నిండి విష వాయువులతో గదులన్నీ నిండిపోయాయి. దీంతో కుటుంబంలోని వారంతా ఊపిరాడక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
భద్రతా ప్రమాణాలు నిల్..
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.. వీరిలో ప్రహ్లాద్ (70), మున్నీ (70), రాజేందర్ మోడీ (65), సుమిత్ర (60), హమేయ్ (7), ఇద్దు (4), రిషబ్ (4), ప్రియాన్ష్ (4), అనుయన్ (3), ఆరుషి (3), ఇరాజ్ (2), ప్రథమ్ (1), అభిషేక్ (31), షీతల్ (35), వర్ష (35), పంకజ్ (36), రజిని (32) ఉన్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్‌తో పాటు, భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం కూడా ప్రమాద తీవ్రతకు కారణాలుగా భావించి విచారణ జరుపుతున్నారు.
అక్రమ కనెక్షన్ కూడా ఓ కారణం?
గుల్జార్ హౌస్‌లోని కింది భాగంలో ఉన్న నగల షాప్ నుంచి స్థానికులు అక్రమ కనెక్షన్ (Illegal current connection) పొందుతున్నట్లు సమాచారం.నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి కొక్కెంల సాయంతో స్థానికులు కరెంట్ కనెక్షన్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ అక్రమ వలన బాధిత కుటుంబంలోని కరెంట్ మీటర్‌పై లోడ్ పడింది. ఆ లోడ్‌తో బాధిత కుటుంబం మీటర్ బాక్స్‌లో మంటలు చెలరేగి మీటర్ బాక్స్ పక్కన ఉన్న ఉడెన్ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయి. దాని నుంచి ఏసీ కంప్రెషర్‌ను మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున మంటల చెలరేగినట్లు సమాచారం. దీనిపై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.






