బీఆర్ఎస్ (BRS) నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (BRS EX MLA Shakeel) ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. ఆయన హైదరాబాద్ లో అడుగుపెట్టగానే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్న షకీల్.. తన తల్లి అంత్యక్రియల కోసం గురువారం రోజున హైదరాబాద్ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షకీల్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్ పోర్టులో అరెస్టు
ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Praja Bhavan Car Accident) కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో షకీల్ దుబాయ్ కు వెళ్లారు. గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నారు. అయితే ఇటీవల ఆయన తల్లి మరణించారు. దీంతో గురువారం రోజున ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తల్లి అంత్యక్రియల కోసం వచ్చిన షకీల్ ను ఎయిర్ పోర్టులోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాతే విచారణ
అయితే తన తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న అధికారులు షకీల్(Ex MLA Shakeel Arrest)ను అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించారు. ఈ కార్యక్రమం తర్వాత మళ్లీ అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలో ప్రజాభవన్ వద్ద కారు ప్రమాదం కేసు గురించి పోలీసులు షకీల్‌ను విచారించే అవకాశముంది. మరోవైపు తల్లి మరణించడంతో షకీల్ కు బీఆర్ఎస్ నేతలు సానుభూతి ప్రకటించారు.
అందుకే కేసు నమోదు
ఇక షకీల్ కుమారుడు సాహిల్ (Shakeel Son Sahil Case) గతంలో కారును వేగంగా నడుపుతూ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సాహిల్ పై కేసు నమోదైంది. ఇందులో నుంచి అతణ్ని తప్పించేందుకు పలువురు అధికారులు కూడా ప్రయత్నించినట్లు తేలింది. ఈ క్రమంలో వారిని సస్పెండ్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు నుంచి కుమారుడిని తప్పించేందుకు షకీల్ ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపైనా పోలీసులు కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు.






