Mana Enadu : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఇక లేరు. గురువారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ను దిల్లీ ఎయిమ్స్ లో చేర్పించగా కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. రాత్రి 9.51 సమయంలో ఆయన కన్నుమూసినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. మాజీ ప్రధాని మరణంతో దేశమంతా శోకంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా దేశానికి ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ రాజకీయ, వ్యాపార, ఇతర ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
శనివారం అంత్యక్రియలు
ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని ఆయన నివాసంలో మన్మోహన్ పార్ధివ దేహం ఉంచారు. శనివారం (డిసెంబరు 28వ తేదీ) మన్మోహన్ సింగ అంత్యక్రియలు (Manmohan Singh Funeral) నిర్వహించే అవకాశం ఉంది. ఆయన కుమార్తెల్లో ఓ కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చేందుకు సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే రేపు ఆయన అంతిమ వీడ్కోలు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
వారం పాటు సంతాప దినాలు
ఈ క్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి వర్గం సమావేశం (Union Cabinet Meeting) జరగనుంది. మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాపదినాలు ప్రకటించనున్నారు. కాంగ్రెస్ కూడా పార్టీ కార్యక్రమాలను అన్నింటిని రద్దు చేసింది. మరోవైపు తెలంగాణ సర్కార్ మన్మోహన్ మరణం పట్ల సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి సెలవు (Telangana Holiday) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






