Mana Enadu : ఏపీలో కూటమి ప్రభుత్వం (AP Govt) ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి పండుగ (అక్టోబర్ 31వ తేదీ) రోజున ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం ముందుగానే ఉచిత గ్యాస్ సిలిండర్లు బుకింగ్ (Free Gas Cylinder Bookings) చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ మేరకు ఇవాళ్టి (అక్టోబర్ 29వ తేదీ) నుంచే ఈ ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 31, 2025 వరకు మొదటి ఉచిత సిలిండర్ కోసం బుకింగ్ చేసుకోవచ్చు.
సిలిండర్ అందకపోతే ఇలా చేయండి
నాలుగు నెలలకోసారి ఏపీ సర్కార్ ఉచిత సిలిండర్ అందించనుంది. గ్యాస్ సిలిండరు ఇంటికి చేరిన 48 గంటల్లోగా వినియోగదారుడి ఖాతాలో రాయితీ నగదు (Free Gas Cylinder Subsidy) జమ అవుతుంది. ఇక సిలిండర్ బుకింగ్ చేసుకున్న 24 నుంచి 48 గంటల్లో ఇంటికి చేరుతుంది. పట్టణాల్లో అయితే 24 గంటల్లోనే వచ్చేస్తుంది. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు (White Ration Card), క్యాండిడేట్ ఆధార్ కార్డు తప్పక ఉండాల్సిందే. ఎవరికైనా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందకపోతే టోల్‌ఫ్రీ నెంబర్-1967కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు
ఏపీ వ్యాప్తంగా 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే సుమారు 1.47 కోట్ల కుటుంబాలు ఈ పథకానికి అర్హత సాధిస్తాయి. వీరికి సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు రూ. 3,640 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల (Ujwala Scheme) కిందకు మార్చితే ఏడాదికి 585 కోట్ల రూపాయల భారం తగ్గుతుందని. ఐదేళ్లకు సుమారు 3 వేల కోట్ల మేర ప్రయోజనం కలిగే అవకాశం ఉందని సర్కార్ భావిస్తోంది.






