Mana Enadu : భారత్‌తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని (Border gavaskar trophy) ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆసీస్.. ఈ సిరీస్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని భావిస్తోంది. కానీ పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో (India vs Australia)బ్యాటర్లు పూర్తిగా విఫలం కావడంతో చిత్తుగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 150 పరుగులకే ఆలౌట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత అనూహ్యంగా 104 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ షోతో 295 రన్స్ తేడాతో ఓడిపోయింది.
హేజిల్‌వుడ్ వ్యాఖ్యలతో చిచ్చు
అయితే ఈ మ్యాచ్ ఫలితంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇందులో ఓటమికి బ్యాటర్లే కారణమనే భావన బౌలర్లలో ఉందని.. ఫలితంగా బ్యాటర్లు, బౌలర్ల మధ్య విబేధాలు ఏర్పడ్డాయని వార్తలు వినిపిస్తున్నాయి. తొలి టెస్టు మూడో రోజు ఆట తర్వాత ఆ జట్టు పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) బ్యాటర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆస్ట్రేలియా ఆట ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మీరు ఈ ప్రశ్నను మా బ్యాటర్లను అడగాలి’ అని అన్నాడు. బ్యాటర్ల వైఫల్యంతోనే ఓడిపోయామనే ఉద్దేశంలో అతడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత హైజిల్వుడ్ అనూహ్యంగా తాను రెండో టెస్టుకు అందుబాటులో ఉండనని టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించాడు.
ఆ జట్టులో ఏదో జరుగుతోంది
ఈ నేపథ్యంలోనే భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హేజిల్‌వుడ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆస్ట్రేలియా జట్టు భయపడుతోందని తెలుస్తోందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ‘ఆసీస్ జట్టులో ఏదో జరుగుతోంది. కొందరిపై వేటు వేయాల్సిందేనని మాజీలు పట్టుబడుతున్నారు. హేజిల్‌వుడ్ మాటలను బట్టి చూస్తే ఆ జట్టు ఐక్యంగా లేదని.. విబేధాలు ఉన్నాయని అర్థమవుతోంది. పింక్ బాల్ టెస్టులో అతడికి మంచి రికార్డు ఉంది. కానీ అతడు బ్యాటర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే పక్కటెముకల నొప్పితో హేజిల్‌వుడ్ రెండో టెస్టుకు దూరమయ్యాడని ప్రకటన చేసింది. ఇందులో ఏదో మిస్టరీ ఉంది. అతడు సిరీస్ మొత్తానికి దూరమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు” అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
ఖండించిన హెడ్
ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల మధ్య విబేధాలు తలెత్తాయనే వార్తలను ఆ జట్టు బ్యాటర్ ట్రావిస్ హెడ్ (Travis head) ఖండించాడు. అవన్నీ అసత్య ప్రచారాలేనన్నాడు. ‘ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆడితే బ్యాటర్లు, బౌలర్లపై భారీ అంచనాలు ఉంటాయి. ఆటగాళ్లంతా వ్యక్తిగతంగా దీన్ని నిరూపించుకోవాలి. స్కోరు బోర్డుపై సరైన పరుగులు ఉంటే బాగుంటుందని బ్యాటర్లకు తెలుసు. మా బౌలర్ల సత్తా ఏంటో కూడా మాకు తెలుసు’ అని హెడ్ పేర్కొన్నాడు.






