ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై పెట్టుబడిదారులు భారీ ఆశలు పెట్టుకున్న తరుణంలో, ప్రముఖ అమెరికన్ ఫైనాన్షియల్ సంస్థ సిటీ గ్రూప్( Citi Group) మాత్రం అందరికీ షాకిచ్చే న్యూస్ ప్రకటించింది. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ, వచ్చే ఏడాదిలో బంగారం రేటు(Gold Price) సుమారు 25 శాతం తగ్గుదల ఉండబోతోందని ఆ సంస్థ అంచనా వేసింది.
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు 27 శాతం మేర పెరిగాయి. దీనికి గల ప్రధాన కారణాలు ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లను పెంచడం, అలాగే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) నుంచి భారీగా పెట్టుబడులు రావడం. అయితే ఈ గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు కొనసాగవని, త్వరలోనే బంగారం ధర పడిపోతుందని సిటీ గ్రూప్‌కి చెందిన ప్రముఖ అనలిస్ట్ మాక్స్ లేటన్ నేతృత్వంలోని నిపుణులు ఈ అంచనాలను వెల్లడించారు.
ఇక వచ్చే త్రైమాసికంలో బంగారం ధర $3,000 కన్నా తక్కువ స్థాయికి వచ్చే అవకాశముందని చెప్పారు. అంతేకాక, 2026 చివరి సగభాగంలో బంగారం ధరలు $2,500 నుండి $2,700 మధ్య స్థిరపడతాయని అంచనా వేశారు.







