
తిరుమల(Tirumala Tirupati)లో పావనంగా నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి వెంకయ్య చౌదరి(Venkayya Chowdari) తెలిపారు. రెండు నెలల ముందుగానే ఏర్పాట్లను ప్రారంభించిన అధికారులు విభాగాల వారీగా సమగ్ర ప్రణాళికతో పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇటీవల అన్నమయ్య భవనంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన వెంకయ్య చౌదరి, అధికారులను అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
బ్రహ్మోత్సవాల సమయంలో భారీగా భక్తులు వస్తారని దృష్టిలో పెట్టుకొని దర్శనాల విషయంలో టీటీడీ(TTD) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆన్ఐలు, దాతల కోటాలో ఎలాంటి దర్శనాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. కేవలం ప్రోటోకాల్ ఉన్నవారికే మినహాయింపు వర్తించనుంది.
అన్నప్రసాదాల పంపిణీ, గ్యాలరీ ఏర్పాట్లు, దర్శన క్యూ లైన్లు వంటి అంశాలపై పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గరుడ వాహన సేవను సెప్టెంబర్ 28న నిర్వహించనుండగా, ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు.
బ్రహ్మోత్సవాలకు ముందు సెప్టెంబర్(September) 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 23న అంకురార్పణ, సెప్టెంబర్ 24న ధ్వజారోహణం, అక్టోబర్ 1న రథోత్సవం, అక్టోబర్ 2న చక్రస్నానం నిర్వహించనున్నారు. ఈ పర్వదినాల్లో ఉదయం 8 నుంచి 10 వరకు, సాయంత్రం 7 నుంచి 9 వరకు వాహన సేవలు అందుబాటులో ఉంటాయి.
భక్తుల ఆకర్షణకు విద్యుత్ దీపాల అలంకరణలు, పుష్ప-ఫల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అలాగే, లడ్డూలు ఎక్కువగా నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ ప్రత్యేకంగా ఆదేశించింది. రద్దీకి తగిన విధంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం చేయాలని సూచించారు.