
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీర మల్లు’ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 12న థియేటర్లలో విడుదల చేయాలని ముందుగా చిత్రబృందం భావించినా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ తేదీని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఊహాగానాలను నివారించేందుకు నిర్మాతలు తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో అభిమానుల ఓర్పుకు కృతజ్ఞతలు తెలిపుతూ, *”కొత్త విడుదల తేదీపై త్వరలో స్పష్టత ఇస్తామన్నారు చిత్రబృందం.
ఈ అధికారిక ప్రకటనలో, “ప్రతి ఫ్రేమ్‌కి న్యాయం చేయాలన్న మా లక్ష్యంతో, కొన్ని రోజులు సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది మాకూ కష్టమే, కానీ మీ అందరి ఓపికకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘హరి హర వీర మల్లు’ కోసం శ్రమిస్తున్న ప్రొడక్షన్ టీమ్ అంతా అద్భుతమైన ప్రెజెంటేషన్ అందించేందుకు కృషి చేస్తోంది” అని పేర్కొన్నారు.
ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతుండటం, పవన్ కల్యాణ్ రాజకీయంగా కూడా బిజీగా ఉండటంతో పాటు, విజువల్ ఎఫెక్ట్స్, హిస్టారికల్ నేపథ్యం వంటి అంశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. దీంతో ప్రేక్షకులు సినిమాను తెరపై చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతుండటాన్ని చిత్రబృందం తీవ్రంగా స్పందించింది. “తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. సినిమా అప్‌డేట్స్ కోసం మా అధికారిక సోషల్ మీడియా పేజీలను మాత్రమే ఫాలో అవ్వండి,” అని స్పష్టం చేసింది. నిర్ధారణలేకుండా వార్తల రూపంలో అభిప్రాయాలను ప్రచారం చేయడం అభిమానులను గందరగోళానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
‘హరి హర వీర మల్లు’ యొక్క థియేట్రికల్ ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. “ఈ ట్రైలర్‌తో పాటు కొత్త విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తాం. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. వందలాది టెక్నీషియన్లు, కళాకారులు ఈ ప్రాజెక్ట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించగా నిధి అగర్వాల్ కథానాయికగా పవన్ కల్యాణ్‌కు జోడీగా నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం సమర్పణలో, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం, తెలుగు సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశముందన్న అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.