
తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు (Rains) పడుతున్నాయి. మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది.
మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
పిడుగులు (Thunderstorm) పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమతంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్స్ జారీ చేసింది.
ఆదిలాబాద్లో పిడుగులు పడి ఆరుగురు మృతి
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గురువారం పిడుగులు బీభత్సం సృష్టించి ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాయి. జిల్లాలోని గాదిగూడ, బేల మండల్లాలో పిడుగులు పడి ఆరుగురు మృత్యువాత పడ్డారు. గాదిగూడ మండలంలోని ఓ చేనులో కొందరు పనులు చేస్తుం ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో స్పాట్లోనే నలుగురు చనిపోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. బేల మండలంలోని సాంగ్డీలో ఓ మహిళ, సోన్కచ్ గ్రామంలో మరో మహిళ పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.