
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు(గురువారం) భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. గత మూడు రోజుల నుంచి తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగి నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
పశ్చిమ బంగాళాఖాతం(Bay of Bengal)లో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణ(Telangana))లోని మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, యాద్రాద్రి, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలలో అతి భారీ వర్షాల దృష్ట్యా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీచేసింది. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇటు గోదావరి, మూసీ నదులకు వరద పెరిగింది.
ఏపీలోనూ విస్తారంగా వానలు
ఏపీ(Andhra Pradesh)లో నేడు అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కృష్ణ నదికి వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఓపెన్ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.