
అకాల వర్షాలు(Rains) పలు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ముఖ్యంగా అన్నదాత అల్లాడిపోతున్నాడు. పంటలు చేతికొచ్చాయన్న ఆనందం కళ్లాల్లోనే కనుమరుగవుతోంది. ఐకేపీ సెంటర్ల(IKP Centers)లో పోసిన ధాన్యం అనుకోని వర్ష విలయానికి తడిసి ముద్దవుతోంది. దీంతో అన్నదాత(Farmers)కు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ(Department of Meteorology) తాజా ప్రకటన వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో రానున్న 5 రోజులపాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
ఉరుములు.. మెరుపులతో
ఈ సమయంలో పిడుగులు పడతాయనీ, ఉరుములు, మెరుపులు బాగా వస్తాయని చెప్పింది. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని వివరించింది. అలాగే తెలంగాణ(Telangana)లో 15, 16 తేదీల్లో పిడుగులు బాగా పడతాయనీ, గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటూ.. సుడి గాలులు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి అని చెప్పింది. ఇవాళ కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి అని తెలిపింది.
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం
ఇదిలా ఉండగా గురువారం (May 15) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్(Hyd)లోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. దీంతో జూబ్లీహిల్స్, మాధాపూర్, బంజారహిల్స్, బేగంపేట, అమీర్ పేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, మెహదీపట్నం, LB నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అటు నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ వాన కురుస్తోంది. మరోవైపు ఏపీ(AP)లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది.