సంక్రాంతి పండుగ (Sankranti Festival 2025) దగ్గరికి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు పండుగ సెలవులు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వృత్తి, ఉద్యోగం, విద్య వివిధ కారణాలతో సొంతూళ్లకు దూరంగా పట్టణాల్లో ఉన్న వారంతా పండుగకు ఊరెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్లంతా పల్లెలకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రాకు వెళ్లే వారితో రహదారులు రద్దీగా మారుతున్నాయి.
పంతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (Hyderabad Vijayawada High Way)పై శనివారం ఉదయం రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక టోల్ గేట్ సిబ్బంది 10 టోల్‌బూత్‌ల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని.. 6 గేట్ల ద్వారా హైదరాబాద్ వైపు వచ్చే వారిని పంపిస్తున్నారు.
కిక్కిరిసిన బస్టాండ్లు
మరోవైపు చౌటుప్పల్ కూడలిలో అండర్‌పాస్ నిర్మాణ పనుల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రద్దీ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీస్ (MGBS), జేబీఎస్ (JBS), దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ కూడలి రద్దీగా మారాయి. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.







