ManaEnadu : కార్తికమాసం తొలి సోమవారం (Karthika Somavaram) వచ్చేసింది. ఈ సందర్భంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేకువజాము నుంచే భక్తులంతా కుటుంబంతో సహా శైవ క్షేత్రాలను సందర్శించారు. కృష్ణా, గోదావరి (Godavari) తీరాలు భక్తుల పుణ్యస్నానాలతో సందడిగా మారాయి. ప్రముఖ శివ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పలు ఆలయాల్లో భారీగా రద్దీ నెలకొంది.
వేములవాడ ఆలయంలో భక్తుల రద్దీ
భకత్లు శివాలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక దీపారాధన (Karthika Deepam) చేసి పరమేశ్వరునికి మొక్కుకుంటున్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులతో సందడిగా మారింది. ఇవాళ (నవంబర్ 4వ తేదీ) రెండు సార్లు సత్యనారాయణ వ్రతం నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్నపూజ సేవలను రద్దు చేశారు.
భక్తులతో శైవక్షేత్రాలు కిటకిట
మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని శివాలయాల (Lord Shiva Temple) భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వాడపల్లిలోని మీనాక్షి అగస్తేశ్వర ఆలయంతో పాటు పిల్లలమర్రి, మేళ్లచెరువు శివాలయాల్లో కార్తిక శోభ వెల్లివిరుస్తోంది. మరోవైపు భద్రాచలంలోని గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తికదీపాలను నదిలో వదిలి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు.
శ్రీశైలంలో కార్తిక శోభ
ఇక ఏపీలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం(Srisailam Temple)లో వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే తరలివచ్చి భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ, అమరావతిలోని అమరేశ్వరాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్ల, బాపట్ల జిల్లా చీరాల, పేరాల శివాలయాల్లో కార్తిక శోభ వెల్లివిరుస్తోంది.






