గత కొన్ని వారాలుగా వెండి ధరలు(Silver Rates) అనూహ్యంగా పెరిగి మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్(International market)లో వెండి ధర ఔన్స్‌కు $35ని దాటడంతో, భారతీయ మార్కెట్‌లో కిలో ధర రూ. 1,31,000కు చేరింది. గత 5 రోజుల్లో కేజీ వెండిపై రూ.6,000 పెరిగి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరడం గమనార్హం. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి(Global economic uncertainty), డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, పారిశ్రామిక డిమాండ్ పెరుగుదల, సురక్షిత పెట్టుబడిగా వెండి పట్ల పెరిగిన ఆసక్తి. సౌర శక్తి, ఎలక్ట్రానిక్స్ వంటి పరిశ్రమల్లో వెండి వినియోగం గణనీయంగా పెరగడమే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాబోయే నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం
ఇక మన దేశంలో ఈ ధరల పెరుగుదల ఆభరణాలు (Jewellery), పెట్టుబడుల(Investments)పై ప్రభావం చూపుతోంది. వినియోగదారులు, పెట్టుబడిదారులు ఈ ధోరణిని దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, అయితే మార్కెట్ అస్థిరత కారణంగా జాగ్రత్తగా వ్యవహరించాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అటు బంగారం ధర(Gold Rates)లూ రూ. లక్షకుపైనే నమోదవుతున్నాయి. ఇవాళ (ఆగస్టు 25) 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,01,510కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.93,050 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.






