హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక (Hyderabad MLC Election 2025)కు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) పోటీకి దూరంగా ఉండటంతో బీజేపీ, ఎంఐఎం మధ్యే ఈ పోరు సాగుతోంది. బీజేపీ అభ్యర్థి గౌతంరావు, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండిల భవితవ్యం బాలెట్ బాక్సులో నిక్షిప్తం కానుంది.
మొత్తం 112 మంది ఓటర్లు
ఈ ఎన్నికలో మొత్తం 112 మంది ఓటర్లు (Hyderabad MLC Voters) ఉండగా 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగులో పాల్గొననున్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్లు (Corporators), ఎమ్మెల్యేలు, ఎంపీలు (MPs) ఓటు హక్కు వేసేందుకు ఉదయాన్నే తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓ మైక్రో అబ్జర్వర్‌తో పాటు, కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు సహాయకులు పోలింగును పర్యవేక్షిస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఓటింగ్ జరగనుంది.
25న కౌంటింగ్
ఎక్స్ అఫిషియో సభ్యుల కోసం ఒక పోలింగ్ కేంద్రం, కార్పొరేటర్లకు మరో కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ (NOTA Option) ఉండదని విప్ కూడా ఉండదని వెల్లడించారు. మరోవైపు ఈ పోలింగ్‌కు బీఆర్ఎస్ కార్పొరేటర్లను దూరంగా ఉండాలంటూ పార్టీ హైకమాండ్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం బరిలో లేకున్నా తమ కార్పొరేటర్లు ఓటింగ్‌లో పాల్గొంటారని స్పష్టం చేసింది. ఈ నెల 25న కౌంటింగ్ జరగనుంది.






