
Mana Enadu : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణను అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (Hydra) తన పనితీరులో దూసుకెళ్తోంది. ఇప్పటికే వందల అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. బుల్డోజర్లతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతున్నారు. అయితే తాజాగా కూల్చివేతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆ నిర్మాణాలు కూల్చేస్తాం
జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల (Hydra Demolitions) జోలికి వెళ్లబోమని స్పష్టం చేశారు. గతంలో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు వెళ్లమని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని తేల్చి చెప్పారు.
హైడ్రా పేదల జోలికి వెళ్లదు
అయితే కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందని తెలిపిన రంగనాథ్.. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు. పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ హైడ్రాపై వస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా పేదల జోలికి హైడ్రా రాదని కమిషనర్ స్పష్టం చేశారు. వారి ఇళ్లను కూల్చివేస్తున్నామనే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు.
హైడ్రా మరో కీలక నిర్ణయం
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఇటీవలే హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు (Hydra Complaints) తీసుకోవాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ప్రాంతంలోని.. చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలపై ఫిర్యాదులు ఇవ్వొచ్చని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.