Mana Enadu : హైదరాబాద్ మహానగరం పరిధిలోని చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా.. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘హైడ్రా’ (Hydra)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ రంగనాథ్ ను హైడ్రాకు కమిషనర్ గా నియమించింది. ఇక ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ.. సర్కార్ స్థలాల్లో, చెరువులు, నాలాలు ఆక్రమించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కూల్చివేస్తూ దూసుకెళ్తున్నారు.
సర్కార్ జాగాలో ఫంక్షన్ హాల్
గత కొన్నిరోజులుగా హైడ్రా కూల్చివేతలు (Hydra Demolitions) నెమ్మదించాయి. కానీ తాజాగా మరోసారి హైడ్రా తన బుల్డోజర్లకు పని చెప్పింది. శుక్రవారం రోజున సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూల్చివేతలు చేపట్టింది. కౌకుర్ డీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ (Function Hall Demolition)ను హైడ్రా అధికారులు కూల్చిశారు. ప్రభుత్వ స్థలంలో నాలాపై అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు గుర్తించిన అధికారులు జేసీబీ సాయంతో ఫంక్షన్ హాల్‌ను నేలమట్టం చేశారు.
ఫంక్షన్ హాల్ పైకి బుల్డోజర్
నాలాపై అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా.. సర్వే నంబర్ 14లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సైతం కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. సర్వే నంబరు 14లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే నంబరు 25లో ఉన్న ప్రైవేటు స్థలంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు కూల్చివేతల (Hydra Demolitions)కు ఉపక్రమించారు.
హైడ్రా నయా ప్లాన్
ఇక ఇటీవలే హైడ్రా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు (Hydra Funds) మంజూరు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని నిర్ణయించిన కమిషనర్ రంగనాథ్.. కొత్త ఏడాదిలో ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా.. చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలపై ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు.