
Mana Enadu : ప్రభుత్వ భూముల పరిరక్షణ (Govt Lands), చెరువులు, నాలాల కబ్జాలను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ హైడ్రా (HYDRA)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణాలు ఎవరివైనా సరే నేలమట్టం చేస్తోంది. తాజాగా నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో బుల్డోజర్లను దింపింది.
రంగంలోకి హైడ్రా బుల్డోజర్లు
ఇక 2024 చివరి రోజు డిసెంబరు 31వ తేదీన కూడా హైడ్రా యాక్టివ్ గా పని చేస్తోంది. మంగళవారం రోజున హైడ్రా నగరంలోని పలు చోట్ల బుల్‌డోజర్లు దింపింది. ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో కూల్చివేతలు (Hydra Demolitions) చేపట్టింది. చెరువు బఫర్ జోన్ లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇటీవల ఈ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) పరిశీలించారు. ఈ నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని నిర్ధారించుకున్నారు. అనంతరం ఇవాళ కూల్చివేతలకై బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.