టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన (Kalpana).. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని తెలిపారు. తన కుమార్తె విషయంలో చోటుచేసుకున్న మనస్పర్థల వల్ల నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నానని, దాని వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వెల్లడించారు. కల్పన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఈ విషయానికి సంబంధించి ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
ప్రెస్ నోటులో ఏం ఉందంటే?
‘‘గత ఐదేళ్ల నుంచి కల్పన తన భర్తతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె దయ ప్రసాద్ కు, కల్పనకు మధ్య చదువు విషయంలో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. ఇటీవల కేరళ వెళ్లిన కల్పన దయను హైదరాబాద్ రమ్మన్నారు. ఆమె రానని చెప్పడంతో కల్పన హైదరాబాద్ కు వచ్చారు. ఆ తర్వాత కుమార్తెతో వాగ్వాదం జరిగిన విషయం తెలుసుకున్న కల్పన భర్త ఆమెకు ఫోన్ చేయగా స్పందన లేదు.
అపస్మారక స్థితిలో కల్పన
చాలాసార్లు చేసినా స్పందించకపోవడంతో ఆయన కాలనీ వెల్ఫేర్ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాలనీ సభ్యులతో కలిసి కల్పన ఇంటి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఎంతకీ ఆమె డోర్ తీయకపోవడంతో వెనుక వైపు ఉన్న కిచెన్ డోర్ నుంచి లోపలికి వెళ్లి చూసే సరికి, బెడ్ రూమ్‌లో ఆమె అపస్మారక స్థితిలో కనిపించారు.
నేను సూసైడ్ చేసుకోవాలనుకోలేదు
వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె నుంచి మేం వాంగ్మూలం సేకరించాం. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పారు. తనకు, తన కుమార్తెకు జరిగిన చిన్న గొడవ వల్ల నిద్ర పట్టక అధిక మోతాదులో మాత్రలు వేసుకున్నట్లు చెప్పారు.” అని పోలీసులు ప్రెస్ నోట్ లో వివరించారు.






