జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. అయితే ఈ దాడి గురించి భయానక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు కేవలం పురుషులనే టార్గెట్ చేశారని.. అందులోనూ హిందువులనే లక్ష్యంగా చేసుకున్నారని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యులు చెబుతున్నారు.
మహిళతో ఉగ్రవాది సంభాషణ
అయితే ఉగ్రవాదులు తన కళ్ల ముందే తన భర్తను చంపేశారని కర్ణాటకకు చెందిన ఓ మహిళ పేర్కొన్నారు. తనను కూడా చంపమని వేడుకుంటే.. ‘‘నిన్ను చంపను.. వెళ్లి మోడీ(PM Modi)’’కి చెప్పు అంటూ ఉగ్రవాది తనతో సంభాషించాడని ఆ మహిళ ఇండియన్ ఆర్మీ జవాన్లకు చెప్పారు. కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో విలవిలలాడిన ఆ మహిళ తన భర్త మృతదేహాన్ని విమానంలో శివమొగ్గకు తరలించాలని ప్రభుత్వాధికారులను వేడుకుంటోంది.
నా కళ్ల ముందే చంపారు
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్-పల్లవి (Karnataka Man Died in Terror Attack) దంపతులు తమ కుమారుడితో కలిసి కశ్మీర్‌లోని పహల్గామ్ ను సందర్శించారు. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు తుపాకులతో విరుచుకుపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హిందువులను టార్గెట్ చేసి కాల్పులు జరిపారని పల్లవి తెలిపారు. దాడి జరిగిన సమయంలో నలుగురు ఉగ్రవాదులే ఉన్నారని వెల్లడించారు.
వెళ్లి మోడీకి చెప్పు
“నా కళ్ల ముందే నా భర్తను చంపేశారు. నా భర్తే లేనప్పుడు నేనెందుకు బతికుండాలి. నన్ను కూడా చంపేయండి అని నేను వాళ్లను వేడుకున్నాను. అయితే అప్పుడు నా భర్తను పొట్టనపెట్టుకున్న ముష్కరుడు.. నేను నిన్ను చంపను.. ఈ విషయం వెళ్లి మోడీకి చెప్పు అంటూ నాతో చెప్పాడు. దాడి జరగగానే స్థానికులు వచ్చి సాయం చేశారు. నన్ను వాళ్లే కాపాడారు. నా భర్త మృతదేహాన్ని తరలించేందుకు విమానం ఏర్పాటు చేయాలి.” అని పల్లవి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.






